వుహాన్‌, జపాన్‌ నుంచి భారతీయుల తరలింపు

 కరోనా కలకలం నేపథ్యంలో జపాన్‌కు చెందిన డైమండ్‌ ప్రిన్స్‌ నౌకలో కొన్ని రోజుల పాటు చిక్కుకున్న భారతీయులతో పాటు మరో ఐదుగురు విదేశీయులు సురక్షితంగా ఢిల్లీకి ఇవాళ ఉదయం చేరుకున్నారు. కరోనా వైరస్‌(కొవిడ్‌-19) ప్రభావంతో ఫిబ్రవరి 3 నుంచి యోకోహోమా పోర్టులో నిలిపివేసిన ఈ నౌకలోని 3711 మందిలో 138 మంది భారతీయులు ఉన్నారు. వీరిలో 16 మందికి కరోనా వైరస్‌ సోకగా వారిని జపాన్‌లోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. మిగతా 119 మందితో పాటు శ్రీలంక, నేపాల్‌, సౌతాఫ్రికా, పెరూ దేశాలకు చెందిన ఐదుగురు కూడా సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నట్లు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ ట్వీట్‌ చేశారు. 119 మంది భారతీయులతో పాటు ఐదుగురు విదేశీయులతో ఎయిరిండియా విమానం టోక్యో నుంచి ఢిల్లీకి చేరుకుందని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. భారతీయుల తరలింపుకు సహకరించిన జపాన్‌ అధికార వర్గాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎయిరిండియాకు మరోసారి జైశంకర్‌ ధన్యవాదాలు చెప్పారు.