ఫిబ్రవరి 15న సహకార ఎన్నికలు

రాష్ట్రంలోని 906 ప్రాథమిక వ్యవసాయ, సహకార సంఘాల (పీఏసీఎస్‌- ప్యాక్‌)కు ఫిబ్రవరి 15వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. అదేరేజు సాయంత్రం కల్లా ఫలితాలు ప్రకటిస్తారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర సహకారశాఖ ఎన్నికల అథారిటీ షెడ్యూల్‌ విడుదలచేసింది. హైదరాబాద్‌ మినహా మిగిలిన తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 909 పీఏసీఎస్‌లు ఉండగా.. మూడుచోట్ల ఎన్నికలు నిర్వహించడంలేదని అథారిటీ పేర్కొంది. వీటిలో వరంగల్‌, నల్లగొండ జిల్లాల్లోని ఒక్కొక్క సహకార సంఘం పాలకవర్గాలకు ఆగస్టు చివరి వరకు కాలపరిమితి ఉన్నదని, రంగారెడ్డి జిల్లా మామిడిపల్లి పనితీరు సక్రమంగా లేకపోవడంతో దానిని రద్దుచేసినట్టు అధికారులు వెల్లడించారు. 


పీఏసీఎస్‌ ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరి మూడో తేదీన జిల్లాలవారీగా ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు నోటిఫికేషన్‌ జారీచేస్తారు. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 9వ తేదీన వాటిని పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 10వ తేదీ వరకు గడువు విధించారు. అదేరోజు సాయంత్రం అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు కేటాయిస్తారు. ఫిబ్రవరి 15న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. అదేరోజు కౌంటింగ్‌ పూర్తిచేసి, ఫలితాలు ప్రకటిస్తారు.